హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తేతెలంగాణ): ఉమ్మడి వరంగల్ పర్యటనలో ఇటీవల సమ్మక్క బరాజ్‌ను సందర్శించిన మంత్రుల బృందం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం తప్ప ఉద్ధరించిందేంటని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క బరాజ్ పనులను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90శాతం చేసినా, మిగతా 10శాతం పనులు పూర్తి చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్‌పై కక్షతోనే అటు కాశేళ్వరం, ఇటు దేవాదుల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగించే ఏ చర్యను బీఆర్ఎస్ సమర్థించదని బనకచర్లను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
ఎలాంటి అనుమతులు లేని తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని రాజయ్య మండిపడ్డారు. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట రూ. 2700 కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం తప్ప సాధించిందేమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్లో సామాజిక న్యాయం లేదని గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మేడిగడ్డ వద్ద 95 మీటర్ల ఎత్తునుంచి గోదావరి ప్రవహిస్తున్నా సర్కారు మాత్రం కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నీళ్లు వృథాగా పోతుంటే నేరపూరిత నిర్లక్ష్యం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. సర్కారు అనుమతిస్తే మోటర్లు ఆన్‌చేస్తామని చెబుతున్న ఇంజినీర్ల మాటలను పెడచెవిన పెడుతున్నదని ఆరోపించారు. మొన్నటి మంత్రుల పర్యటనలో ఫొటోలకు పోజులివ్వడం.. చప్పుట్లు కొట్టడం..విందారగించడం తప్ప సాధించిందేమీలేదన్నారు.