కమలాపూర్/ కమలాపూర్ రూరల్, అక్టోబర్ 6: ‘దసరా, బతుకమ్మ పండుగ వచ్చింది.. బీజేపీ ఏమిచ్చింది.. దసరా పండుగ కానుకగా గ్యాస్ ధరను రూ.15 మళ్లీ పెంచింది.. సిలిండర్ ధర రూ.952 చేసినందుకు పువ్వు గుర్తు వాళ్లకు ఓటు వేయాలా?.. గ్యాస్ సబ్సిడీ రూ.250 నుంచి రూ.25కు తగ్గించినందుకు వేయా లా?.. ప్రజలు ఆలోచించాలి’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో టీఆర్ఎస్ ధూంధాంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై కారు ఎక్కించి చంపిన బీజేపీకి ఓటెందుకు వేయాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెడ్తున్న పథకాలు, అభివృద్ధితో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేసిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు నిలిపి.. రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ఉద్యోగులతో సమానంగా రైతులకు రైతుబీమా అందిస్తున్నామని, ఈ పథకంతో రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి 11 రోజుల్లోగా రూ.5 లక్షలు అందించి భరోసా ఇస్తున్నామని స్పష్టంచేశారు. అభయహస్తం మహిళలకు 2 వేల పింఛన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని వెల్లడించారు.
స్వార్థం కోసమే ఈటల రాజీనామా
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశమిస్తే.. అక్రమ సంపాదనను కాపాడుకోవాలన్న స్వార్థంతోనే ఈటల రాజేందర్ రాజీనామా చేశారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తాను రాజీనామా ఎందుకు చేశారో చెప్పకుండా మొసలికన్నీరు కారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని.. ఉన్నది రెండు పార్టీలే అవి టీఆర్ఎస్, బీజేపీలేనని చెప్పారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయోలేవో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చినప్పుడు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని చెప్పే ధైర్యం ఈటలకు ఉందా? అని నిలదీశారు. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటెయ్యాలో?, ప్రజలను దోచుకుంటున్న బీజేపీకి ఓటెయ్యాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక్క రుపాయి పనిచేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే సొంత స్థలాల్లోనే నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని, ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెల్లును భారీ మెజారీటితో గెలిపించాలని కోరారు.
ఆడపడుచులకు పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. మహిళా ఉద్యోగులకు గంట ముందు ఇంటికి వెళ్లే అవకాశం ఇచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పండుగ సందర్భంగా వంటగ్యాస్ ధరను మరో రూ.15 పెంచి రూ.952 చేసింది. సామాన్యులపై ధరల భారం మోపుతున్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి.
-మంత్రి హరీశ్‌రావు