అభివృద్ధి కోసం వినియోగించాల్సిన భూములు అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. ఆర్థికంగా సర్కార్‌ను ఆదుకోవాల్సిన సంపద.. ‘అస్మదీయుల’ పరంచేస్తున్నది ప్రభుత్వం. సర్కారీ భూములతో రేవంత్ ప్రభుత్వం బంతాట ఆడుతున్న తీరుకు ఉదాహరణలెన్నో! ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన పంటపొలాల్లో ఫోర్త్ సిటీ అనబడే ఊహాజనిత నగరం కడుతామంటూ ప్రజల కండ్లకు గంతలు కడుతున్నది. తాజాగా తెల్లాపూర్ ఉస్మాన్ నగర్లో ఐటీ రంగ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సేకరించిన 47.55 ఎకరాల భూమిని వేలానికి పెడుతున్నది.
రామచంద్రాపురం, మార్చి 4: రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించాల్సిన స్థలాలను వేలం వేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల భూములతో ఆడుకుంటున్నది. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ ఉస్మాన్‌నగర్‌లోని భూముల్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులతో ఆ ప్రాంతాభివృద్ధి తిరోగమనం దిశగా సాగుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా అడుగులు
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు రెండున్నరేండ్లలో ఓవైపు పేదల ఇండ్లను కూల్చడం, మరోవైపు సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు గుంజుకోవడం, ఇంకోవైపు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వాడుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వివిధ రంగాల అభివృద్ధి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ ఈనాటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విరుద్ధంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇందుకు రంగారెడ్డి జిల్లాలోని గ్రీన్ ఫార్మాసిటీయే ప్రత్యక్ష ఉదాహరణ. ఫార్మాసిటీ కోసమే భూములను వినియోగిస్తామనే స్పష్టమైన షరతుతో కేసీఆర్ ప్రభుత్వం భూములు సేకరించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఫోర్త్‌సిటీ అంటూ రియల్ దందా చేస్తున్నది. ఫార్మా సిటీని రద్దు చేసినా భూములు తిరిగి ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఐటీ రంగ విస్తరణలో భాగంగా ఉస్మాన్‌నగర్ గ్రామంలో ఐటీపార్క్ కోసం అసైన్డ్ భూములు సేకరించింది. సుమారు 90మంది రైతుల నుంచి ఎకరాకు రూ.45 లక్షలు చెల్లించి భూమి తీసుకొని టీజీఐఐసీకి అప్పగించింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు రైతులకు నష్టపరిహారం చెల్లించి భూమిని సేకరిస్తే, ఇప్పుడు రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ భూములను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేసింది. ఇటీవలే టీజీఐఐసీ వేలం ప్రకటన విడుదల చేసింది. ఉస్మాన్‌నగర్‌లో సర్వేనంబర్ 30లోని 47.55 ఎకరాల భూమిని ఏడు భాగాలుగా విభజించి వేలానికి పెట్టింది. దీంతో ఐటీ విస్తరణ కోసం నిర్దేశించిన భూములను ప్రభుత్వం అంగట్లో పెట్టి తెగనమ్మేందుకు నిర్ణయించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేలం వేయాల్సిన చోట ధారాదత్తం
ఒకవైపు ఐటీ కోసం సేకరించిన భూములను వేలం వేస్తున్న ప్రభుత్వం.. వాస్తవంగా వేలం వేయాల్సిన భూములను మాత్రం అస్మదీయులకు కట్టబెడుతుండటం గమనార్హం. కోకాపేటలోని నియోపొలిస్ లేఅవుట్లో 10 ఎకరాల భూమిని క్రషర్ కంపెనీకి అప్పగించింది. దీని విలువ దాదాపు రూ.1,500 కోట్లు అని సమాచారం. ఆ భూములను సీఎం రేవంత్‌రెడ్డి మేనల్లుడికి ధారాదత్తం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవలే ఆరోపించారు. ఇలా ఓవైపు వేలం వేయాల్సిన భూములను అప్పనంగా అస్మదీయులకు కట్టబెడుతూ, మరోవైపు అభివృద్ధితోపాటు ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కేటాయించిన భూములను మాత్రం వేలం వేస్తూ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. పైగా ఉస్మాన్‌సాగర్‌కు సంబంధించి టీజీఐఐసీకి ఇచ్చిన వేలం ప్రకటనలో ఆ భూములను బహుళ ప్రయోజనకర (మల్టిపపర్పస్ యూజెస్) భూములుగా పేర్కొన్నది. అంటే వేలంలో దక్కించుకొన్న వాళ్లు నివాస, వాణిజ్య ఇలా ఏ అవసరాలకైనా ఆ భూములను వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి
ప్రభుత్వ భూములను ఐటీ వంటి సెక్టార్లకు వినియోగించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ భూములను వేలం వేయడం దుర్మార్గం. రెండున్నర సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తెల్లాపూర్ పరిధిలో వేల సంఖ్యలో నివాస సముదాయాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ఉస్మాన్‌నగర్‌లోని 47.55 ఎకరాలను ఐటీ రంగ విస్తరణకు వినియోగిస్తే కొంతలో కొంతైనా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చినట్టు ఉండేది.
-ఈశ్వరిగారి రమణ, టీనా అధ్యక్షుడు