తిమ్మాపూర్ రూరల్, జనవరి 22 : తెలంగాణ అభివృద్ధికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చేశారని, ఎంపీగా గెలిపించిన కరీంనగర్‌కు ఒక్క రూపాయైనా తెచ్చారా? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూటిగా ప్రశ్నించారు. యువకులను రెచ్చగొట్టి రాజకీయం చేయడం తప్ప రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆయన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్ల నిధులతో పల్లెలను ప్రగతిపథంలో నడిపిస్తుంటే.. ఏం చేయని వారు విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు సీఎం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని, దేశంలో బీఆర్ఎస్ సంచలనం సృష్టించబోతున్నదని ఆయన వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఇక నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తే ఊరుకోవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.