హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలో అరుదుగా కనిపించే గుండెపోటు ఇప్పుడు 30 ఏండ్లు దాటనివారిలో కూడా ప్రత్యక్షమవుతున్నది. నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ చింతల భరత్‌రెడ్డి (34) శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేటలోని లియోనియా రిసార్ట్‌లో స్నేహితుడి రిసెప్షన్‌కు వెళ్లి, గుండెపోటుతో శుక్రవారం కుప్పకూలిపోయాడు. మరో ఘటనలో శుక్రవారం ఉదయం కర్నూలుజిల్లాకు చెందిన అనస్తీషియా డాక్టర్ శ్రవణ్(38) గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డాడు. హైదరాబాద్ చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) కెనడాలో గుండెపోటుకు గురయ్యాడు.
ఐటీలో ఎంఎస్ చేయడానికి ఆయన 2022లో కెనడా వెళ్లాడు. స్థానికంగా ఉన్న కనెస్టోగ కాలేజ్, వాటర్లూ క్యాంపస్‌లో ఎంఎస్ చేస్తున్న అహ్మద్ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం అతడికి తీవ్ర గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు కెనడా నుంచి అతడి స్నేహితులు నగరంలోని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముజమ్మిల్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు సహాయం చేయాలని కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో లింగారెడ్డి అనే ఎస్ఐ కూడా గుండెపోటుకు గురయ్యారు. ఈ వరుస ఘటనలు బాధిత కుటుంబాలను శోక సంద్రంలో ముంచివేశాయి. కరోనా తరువాత 30 నుంచి 40 ఏండ్ల వయస్సు లోపు వారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనికి గల కచ్చితమైన కారణాలపై అధ్యయనాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. గత నెల రోజుల వ్యవధిలో పదేండ్లు సైతం నిండని చిన్నారులు కూడా గుండెపోటుతో మృత్యువాత పడటం గమనార్హం.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన లింగారెడ్డి (56) అనే ఎస్ఐ బదిలీపై వచ్చిన మరుసటి రోజే గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా నుంచి గురువారం బదిలీపై వచ్చి కరీంనగర్ సీసీఆర్బీలో విధులకు రిపోర్ట్ చేశారు. అయితే, శుక్రవారం ఉదయం తిరుమలనగర్‌లోని తన ఇంట్లో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.