బడంగ్పేట్, ఏప్రిల్7: ‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా ప్రశ్నించారు. రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. కబ్జాకోరులకు పోలీసులు కాపాలా ఉండటం ఏమిటని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూములను మంగళవారం సీపీఐ నాయకులు ఆర్ శంకర్ నాయక్, ఆర్ గోపాల్‌తో కలిసి అజీజ్ పాషా పరిశీలించారు. తాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ మేనేజర్లు మొదలుకొని అనేక మంది నుంచి ఫోన్లు వచ్చాయని, ‘మీరు ఎందుకు అక్కడికి పోయారు’ అని అడుగుతున్నారంటేనే దీని వెనుక ఏం జరుగుతున్నదో అర్థమవుతున్నదని చెప్పారు. రైతులను మోసం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నదని తెలిపారు. భూముల కోసం పోరాడుతున్న రైతు కుటుంబాలకు మద్దతు ప్రకటించారు. 60 మంది రైతులతో కలిసి వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు వెళ్తుండగా కంపెనీల బౌన్సర్లు అడ్డుకున్నట్టు తెలిపారు. గేటు దగ్గరే ఉండి రైతులకు మద్దతుగా అజీజ్ పాషా మాట్లాడారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
130 మంది రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అజీజ్ పాషా తెలిపారు. రైతులు ఎవరూ భయపడనవసరం లేదని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయపరమైన పోరాట చేసేందుకైనా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల భూములు కాజేసేందుకు బలమైన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రైతులకు భూములు దక్కే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
హైడ్రాకు కనిపిస్తలేదా?
నాదర్గుల్లో సర్కార్ భూమి కబ్జా అవుతుంటే హైడ్రా అధికారులకు కనిపించడం లేదా? అని అజీజ్ పాషా ప్రశ్నించారు. ఇక్కడ 23 ఎకరాల లచ్చమ్మ కుంట కబ్జా అవుతున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలియదా? అని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చడానికే హైడ్రా ఉన్నదని, పెద్దల జోలికి మాత్రం పోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చెరువులోకి వరద వచ్చే దారులన్నీ మూసేసినా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎక్కడో చిన్న ఘటన జరిగితే వాలిపోయే హైడ్రా అధికారులకు లచ్చమ్మకుంట కనిపిస్తలేదా?’ అని ధ్వజమెత్తారు. పెద్దలను కాపాడి పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా పనా? అని దుయ్యబట్టారు. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో ఉన్న భూములు వ్యవసాయానికి పనికి రావని సుప్రీం కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చారని చెప్పారు. ప్రైవేట్ సంస్థలకు రైతుల భూములు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు సహకరించారని ఆరోపించారు. ఏండ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న పొలాల చుట్టూ ప్రైవేట్ కంపెనీలు కంచె వేసినా అధికారులు పట్టించుకోక పోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మమ్మల్ని బతుకనిస్తలేరు
మా అత్తమామలు, మేము ఏండ్ల తరబడి ఇక్కడ సాగు చేసుకుంటున్నం. ఆకుకూరలు, కాయగూరలు, కందులు, ఉలువలు పండించుకుంటున్నం.ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లు మమ్ములను బతుకనిస్తలేరు. మా పొలంలోకి మమ్మల్నే పోనిస్తలేరు. మా భూమిలో మేమే పరాయి వాళ్లమైనం. చుట్టూ రేకులు వేసిండ్రు. బౌన్సర్లు, రౌడీలు కాపలా ఉన్నరు. గేట్లు తీస్తలేరు. వ్యవసాయం చేసుకోనిస్తలేరు. భయపెడుతున్నారు. పోలీసులకు చెప్తే మామీదనే కేసులు పెడుతున్నరు.
– జ్యోతి, రైతు నాదర్గుల్
పొలం కాడికి పోనిస్తలేరు
ఇక్కడ మా భూమి ఉన్నది. బావులు తవ్వించుకున్నం. కరెంటు స్తంభాలు వేయించుకున్నం. బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నం. వేసిన బోర్లు పీకేసిండ్రు. ఇక్కడ ఏండ్ల తరబడి వ్యవసాయం చేసినం. వడ్లు పండించినం. అన్ని రకాల పంటలు పండుతయ్. కోర్టులో కేసు ఉన్నదని మమ్ముల భూమిలోకి పోనిస్తలేరు. ఎన్ని సార్లు పొలం దగ్గరికి పోయినా బెదిరిస్తున్నరు. మాకు న్యాయం చేయాలె. మా భూములు మాకు దక్కేలా చూడాలె. -లలిత, రైతు నాదర్గుల్