ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 6: ‘మేం అధికారంలోకి వస్తే మొదటి తారీఖునే జీతాలేస్తాం’ అని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఆ తరువాత దానిని పక్కనపెట్టారు. ప్రజాపాలన పేరిట అందరికీ న్యాయం చేస్తున్నామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కారు క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నెల ప్రారంభమై వారం గడుస్తున్నా.. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు, ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి పెన్షన్లు నేటికీ అందలేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని గుర్తుచేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏనాడూ వేతనాలు, పెన్షన్లు ఆలస్యం కాలేదని పేర్కొంటున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలోనూ వేతనాలు, పెన్షన్లు మొదటి తారీఖునే ఖాతాల్లో జమయ్యేవి అని వెల్లడించాయి. ఏదైనా సమస్య ఉంటే రెండో తారీఖున సొమ్ములు పడేవని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. కానీ రేవంత్ ప్రభుత్వంలో కనీసం వేతనాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళనలకు దిగడం తప్ప తమకు వేరే పరిష్కార మార్గం లేదని స్పష్టంచేస్తున్నాయి. ఉద్యమాల గడ్డ ఓయూలో వేతనాలు, పెన్షన్ల కోసం ఆందోళనలు చేసే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నాయి. ఓయూలో వెయ్యి కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనల్లో ఊదరగొడుతున్న ఉన్నతాధికారులు అవి ఎవరిని ఉద్ధరించడం కోసమని ఉద్యోగులు మండిపడుతున్నారు.
సుదీర్ఘకాలం యూనివర్సిటీలో సేవలందించి, పదవీ విరమణ చేసిన వారికి నెలనెలావచ్చే పెన్షన్ సొమ్మే ఆధారం. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇతర కుటుంబ పోషణకు సైతం దానిపైనే ఆధారపడాల్సి వస్తుంది. నెలాఖరు వచ్చే సరికి పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. పెన్షన్ సొమ్ము వస్తేనే ఆరోగ్యం చక్కబెట్టుకునేందుకు ఎదురుచూస్తుంటారు. ఏవైనా కుటుంబ సమస్యలు వచ్చినా ఆ సొమ్మే ఆధారం. కనీసం పదవీ విరమణ చేసిన అనంతరం ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఎదురవుతున్నదని పెన్షనర్లు వాపోతున్నారు.
ఇటీవల ఆగస్టులో ఓయూలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్సిటీని ప్రపంచస్థాయి యూనివర్సిటీలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కార్యాచరణ కోసం కమిటీని సైతం అట్టహాసంగా ఏర్పాటు చేశారు. అవసరమైతే వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ వేతనాలు, పెన్షన్లు చెల్లించలేని స్థితిలో వర్సిటీని నిలిపారు. వర్సిటీ అభివృద్ధి విషయంలో రేవంత్రెడ్డి మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. వెయ్యి కోట్లు దేవుడెరుగు… ఒకటో తారీఖున జీతం ఇవ్వండి సారూ..! అంటూ ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలకు గుండెకాయగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో బీసీలకు 42% రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. మరోవైపు ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓయూ టీచర్స్ అసోసియేషన్(ఔటా) ఆధ్వర్యంలో నెలరోజులకు పైగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు సైతం నిరసన వ్యక్తంచేస్తున్నారు. కనీస వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం ఆహారం అందించడంపై విద్యార్థులు అడపాదడపా రోడ్డు ఎక్కుతున్నారు. వేతనాలు, పెన్షన్ల అంశంలో సైతం ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనకు దిగే పరిస్థితి తలెత్తింది.
కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 6 : ఆరు రోజులు గడుస్తున్నా వేతనాలు కోసం శాతవాహన యూనివర్శిటీ పరిధిలోని ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. వర్సిటీ పరిధిలో దాదాపు 120 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికీ వేతనాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, ఉద్యోగుల వేతనాలు ఐఎస్ఎంఎస్కు అటాచ్ చేస్తున్న క్రమంలో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సమయానికి వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత వర్సిటీ వైస్ చాన్స్లర్పైనే ఉంటుంది. గతంలో వేతనాలు, పెన్షన్లకు సరిపడా సొమ్ములేనిపక్షంలో ఇతర వనరుల నుంచి సమకూర్చుకుని సమయానికి ఖాతాల్లో జమచేసేవారు. తిరిగి నిధులు వచ్చిన అనంతరం ఆ సొమ్ము సర్దుబాటు చేసేవారు. ఇదంతా ముందుగానే చేయాల్సిన పనులు. ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమే.
– ప్రొఫెసర్ మనోహర్, అధ్యక్షుడు, ఓయూ టీచర్స్ అసోసియేషన్(ఔటా)
వేతనాలు, పెన్షన్లను ఓయూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు. నిధులను ఇతర వనరుల నుంచి సమకూర్చుకుని చేయాల్సిన అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, వర్సిటీ అధికారులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
– నెల్లి సత్యం, ఓయూ కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పుకొంటూ.. ఓయూను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నది. కనీసం విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. దాదాపు పదివేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉండటంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగిన పరిస్థితి దాపురించింది. గతంలో ఓయూకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. అవసరమైతే వెయ్యి కోట్లు విడుదల చేస్తానని చెప్పినా, అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు సైతం దిక్కులేని పరిస్థితి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వేల కోట్ల హామీలు ఎలా ఇస్తున్నారు? శ్వేతపత్రం విడుదల చేయాలి.
– చటారి దశరథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్వీ