హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): అసలు హైడ్రా అధికారాలు ఏమిటి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను నియంత్రించాల్సి వస్తుందని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒకో కేసు ఒకో రకంగా ఉంటున్నదని వ్యాఖ్యానించింది. హైడ్రా అధికారాలపై స్పష్టత లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను కేవలం నీటి వనరులు, నాలాల పరిరక్షణకే పరిమితం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా చేపట్టిన సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై దాఖలైన ధికరణ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ నోటీసులు జారీచేసినా స్పందించకపోవడంతో హైడ్రా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. చట్టప్రకారమే కూల్చివేతలు జరిగాయని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి హైడ్రా అధికార పరిధికి సంబంధించి ఎవరికీ స్పష్టత లేదని, జీహెచ్ఎంసీ చట్టంలోని ఏ నిబంధనల కింద అది పనిచేస్తున్నదని ప్రశ్నించారు. హైడ్రా వ్యవహారశైలికి సంబంధించి పలు అంశాలను పరిశీలించాల్సి ఉందని, సంధ్య కన్వెన్షన్ నిర్మాణాలకు సంబంధించి ఇరుపక్షాలు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. ఎఫ్‌సీఐ లేఔట్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.