హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగా అడుగుతున్నానంటూ సోమవారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నల్ని సంధించారు. 2014, 2023లో ఉన్న క్రూడాయిల్, పెట్రోల్ ధరల వివరాలను గుర్తు చేశారు. ‘2014లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. ఆనాడు రూ.71లకు లీటర్ పెట్రోల్ ఉండేది. ప్రస్తుతం బ్యారెల్ ధర 65 డాలర్లు ఉందని, పెట్రోల్ ధర మాత్రం రూ.110 ఉందని ఆయన గుర్తు చేశారు. క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు ఇంధన ధరలు పెంచవలసి వస్తే, ఆ ధరలు తగ్గినప్పుడు ధరలు ఎందుకు తగ్గించడం లేదు’ అని లేదంటూ కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ మేరకు ఆ ప్రయోజనాలను సామాన్యుడికి ఎందుకు బదలాయించడంలేదని నిలదీశారు. ఆ సొమ్ము అంతా ఎటు పోతున్నదని, ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని, సామాన్యుడిపై అవి పెను ప్రభావాన్ని చూపుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. 2014 నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, చమురు ధరల కన్నా ఎక్కువ వేగంతో పెరిగినవి కూడా వీటిలో ఉన్నాయని పేర్కొన్నారు.
జీఎస్టీ పరిధిలో ఉంటే ధర ఎలా పెరిగింది?
జీఎస్టీ పరిధిలో ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని చాలామంది భావిస్తున్నారని.. అదే నిజమైతే, జీఎస్టీ పరిధిలోనే ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర మాత్రం 8 ఏండ్లలో మూడు రెట్లు ఎలా పెరిగిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ధరలను తగ్గించలేని నాన్ పెర్ఫార్మింగ్ అలయన్స్ (ఎన్పీఏ) ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తులను ఎలా అప్పగించాలని ఆయన సందేహం వ్యక్తంచేశారు. ‘ఇంధన ధరల పెరుగుదలను అరికట్టేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని అంటున్నారు. అయితే ఎల్పీజీ ధరలు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి. కానీ గత 8 ఏండ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200కు ఎలా పెరిగింది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.