KCR | నాగర్‌కర్నూల్ : బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీశారు. కొత్తగా గడ్డపార పట్టి తవ్వాల్సిన అవసరం లేదు కదా..? గత ప్రభుత్వంలో అమలైన పథకాలను అమలు చేయొచ్చు కదా..? అని అడిగారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ గొప్పదినం. తెలంగాణ పార్టీ పుట్టిన దినం. 23 ఏండ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో, గుండె ధైర్యం తెచ్చుకుని ఏపీ నుంచి బయటపడాలని ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించాం. పెరిగాం. మహాసముద్రం అయ్యాం. ఉప్పెనలా ఉద్యమం నడిపాం. ఆ క్రమంలో చాలా సార్లు నాగర్‌కర్నూల్ వచ్చాను. పార్టీకి 14 ఏండ్లు పూర్తయ్యే సమయంలో ఆమరణ దీక్షకు పూనుకుని కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో తేలాలని ఆనాడు దీక్షకు పోతే ఖమ్మం జైల్లో వేశారు. మీరంతా ఉప్పెనలా ఉద్యమించారు. చివరకు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో పాలమూరు నా గుండెల్లో ఉంటది. ఈ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో మహబూబ్‌నగర్‌కు ఉంటది అని కేసీఆర్ తెలిపారు.
కులం, జాతి, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలను సాదుకున్నట్టు పదేండ్లు గులాబీ జెండా కింద సాదుకుని, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. 50 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీ పాలన ఉంటే పాత మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజైనా వచ్చిందా..? ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి బీఆర్ఎస్ రాజ్యంలో. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించుకుని బస్సులో గద్వాలకు ప్రయాణించాను. వలసలు పోయినా పాలమూరు ఎట్లుందో చూడాలని 200 కి.మీ. బస్సులో వెళ్లాను. చాలా ఆనందం, సంతోష పడ్డాను. వరికోతలు, ధాన్యపు రాశులు చూస్తే ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత బాగైందని సంతోష పడ్డాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
మొన్న అడ్డగోలు హామీలిచ్చి దుష్ర్పచారాలు చేసి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుబంధు అందరికీ వచ్చిందా..? ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 వచ్చాయా.? రుణమాఫీ అయిందా..? తులం బంగారం వచ్చిందా..? అమ్మాయిలకు స్కూటీలు వచ్చాయా..? వరికి రూ. 500 బోనస్ వచ్చిందా..? చివరికి వస్తే ఎండింది ఎండంగ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెడితే కొనే దిక్కు లేదు. వానలకు తడిసిపోతుంది తప్ప కొనే దిక్కు లేదు. ఈ ప్రభుత్వం పరిస్థితి ఇది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఏడాదిలోనే కరెంట్ 24 గంటలు ఇచ్చాం. రెప్పపాటు కరెంట్ పోలేదు. కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ పోతుంది. బావుల కాడ తేళ్లు, పాములు కడుతున్నాయి. ఇప్పటి వరకు 225 మంది రైతులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు కరెంట్ షాకులతో, పాములు కరవడంతో చనిపోయారు. ఈ బాధ ఎందుకు వచ్చిందో ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిన పథకాలు ఇవ్వాలి కదా.. కొత్తగా గడ్డపార పెట్టి తవ్వాల్సిన అవసరం లేదు కదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
సీఎం, మంత్రులు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. కానీ రోజుకు పది సార్లు పోతుంది. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అన్నం తింటుంటే కరెంట్ పోయింది. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని తీసేశారా అని అడిగాను. ఒక్కసారి కాదు.. రోజుకు పదిసార్లు పోతుందని చెప్పారు. ఇది కాంగ్రెస్ పరిపాలన.. మీరంతా కళ్లారా చూస్తున్నారు. బ్రహ్మాండంగా మిషన్ భగరీథతో ఇంటింటికి నీళ్లు అందించాం. ఇప్పుడు బోర్లు ఎందుకు వేస్తున్నారు..? నీళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి.? బిందెలతో ఆడబిడ్డలు కనిపిస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.