నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్లు, కరెంటుస్తంభాలు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర, అనుముల, త్రిపురారం, మిర్యాలగూడ, నేరడుచర్ల మండలాల్లో భారీ వర్షం పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంతోపాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్తు సరఫరాకు, రాకపోకలకు అంతరాయం కలిగింది. సండ్రోన్‌పల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయ్యింది. చెన్నూర్‌లో చెట్లు విరిగిపడ్డాయి.
కోటపల్లి, సర్వాయిపేట, పారుపల్లి, షట్‌పల్లిలో ధాన్యం తడిసింది. రాపనపల్లిలో ఆరె సంతు అనే వ్యక్తి ఇంట్లోని తాటి చెట్టుపై పిడుగుపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై టార్పాలిన్లు కప్పుతుండగా నీలం వెంకన్న అనే కార్మికుడు పిడుగుపాటుతో మృతిచెందాడు. ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. కౌసల్యాదేవిపల్లిలో రెండు మేకలు మృతి చెందాయి. శనిగపురం, ఈదులపూసపల్లి, ముడుపుగల్, అయోధ్య, మల్యాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గాలికి ఆర్టీసీ బస్‌స్టాండ్ ఏరియాలోని రేకుల షెడ్డు ఎగిరిపోయింది. కేసముద్రం మారెట్ యార్డులో మకజొన్న, ధాన్యం తడిసిపోయాయి. తాళ్లపూసపల్లిలో బత్తిని సమ్మయ్యకు చెందిన మూడు కాడెడ్లు పిడుగుపాటుతో మృతిచెందాయి.
డోర్నకల్, బయ్యారం, గార్ల, మరిపెడ, నర్సింహులపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసింది. దంతాలపల్లి, చిన్నగూడూరులో పంటలకు నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లా నెక్కొండలో 80 వేల బస్తాల మక్కలు వర్షార్పణమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం, మక్కలు కొట్టుకుపోయాయి. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. సైదాపూర్ మండలం రాయికల్తోపాటు పలు గ్రామాల్లో వడగండ్లకు వడ్లు రాలిపోయాయి.
ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని మక్కజొన్న, వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. కూసుమంచి, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో వడగండ్ల వాన పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై వేలాది క్వింటాళ్ల ధాన్యం, మక్కలు నీటి పాలయ్యాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది.
కరకగూడెం మండలంలో చెట్లు నేలకొరిగాయి. అనంతారం, కరకగూడెం, పద్మాపురం, గొల్లగూడెం గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరకగూడెం నుంచి బైక్‌పై మొగిలితోగుకు వెళ్తున్న కొమరం నరసింహారావుపై పద్మాపురం సమీపంలో చెట్టుకొమ్మ విరిగి మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పినపాక మండలం గోపాలరావుపేట, కిష్టాపురం, జానంపేట, తోగ్గూడెంలో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కారేపల్లి మండలం మాదారంలో మక్కజొన్న తడిసింది. గత 20రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మక్కలను కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంజిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిపై మక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. మద్దులపల్లి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ఆలస్యంకావడంతో ఆదివారం కురిసిన వర్షానికి పంట తడవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.
మేము మార్కెట్‌కు తెచ్చిన వడ్లు మొత్తం ఎండినయ్. ఇక కాంటా పెడుతామని అధికారులు చెప్పిండ్రు. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం పడింది. దీంతో వడ్లు మొత్తం తడిసిపోయినయి. మళ్లీ వడ్లను ఎండబెట్టాలంటే వారం రోజులు ఇక్కడే ఉండాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎండలో రోజుల తరబడి ఉంటున్నాం. మళ్లీ వడ్లు ఎండేదాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అధికారులు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలి.
– కానవేని పద్మ, రైతు,ఆరెపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
ఆరబోసిన వడ్లు మొత్తం తడిసి పోవడమే కాకుండా కొన్ని వడ్లు వరదకు కొట్టుకపోయాయి. ఇవి కుప్ప పోసినా, ఆరబోసినా ఇప్పట్లో ఎండేటట్లు లేవు. చేతికందిన పంట వానకు కొట్టుకపోవడం బాధగా ఉన్నది. కొట్టుకపోయే పంటను చేతులతో ఆపి కాపాడుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది. అధికారులు కరుణించి తడిసిన, రంగుమారిన వడ్లను కూడా కొనుగోలు చేయాలి.
-శ్యామల, రైతు, నాగారం, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి వద్ద ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో నీళ్లలోని వడ్లను ఎత్తుతున్న మహిళా రైతు

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్‌యార్డులో నీళ్లలో వడ్లను ఎత్తుతున్న రైతులు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతుల ఉరుకులు పరుగులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో నీళ్లలోని వడ్లను పారతో తీస్తున్న రైతు

వరంగల్ జిల్లా నెక్కొండలో వర్షానికి టార్పాలిన్ షీట్స్‌పై నిలిచిన నీటిని బకెట్‌తో తోడేస్తున్న రైతు