Chandrababu Naidu | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బేగంపేటకు వచ్చారు.
బేగంపేట నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ సీఎం హోదాలో నగరానికి వచ్చిన సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ర్యాలీ మార్గాన్ని పసుపుమయం చేశారు. అడుగడుగునా నిబంధనలకు తిలోదాకాలిచ్చి కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
వాస్తవానికి హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటానికి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి నిర్ణీత పన్ను చెల్లించి అనుమతులు పొందా లి. కానీ తెలుగు తమ్ముళ్లు అనుమతులు లేకుండా మెట్రో పిల్లర్లకు, సెంట్రల్ మీడియన్, ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తొలగించాల్సిన ఈవీడీఎం విభాగం చేతులేత్తేసింది. దీంతో ఆ శాఖ అధికారుల పనితీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహికి అధికార పార్టీ దాసోహం అయిందంటూ తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
జూబ్లీహిల్స్ చౌరస్తాలో టీడీపీ శ్రేణు లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. ఆ ఫ్లెక్సీలను నగర ట్రాఫిక్ సిబ్బంది సరిచేసి ఏర్పాటు చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. టీడీపీ ఫ్లెక్సీలను ట్రాఫిక్ పోలీసులు ఏ ర్పాటు చేస్తున్నారని చర్చ జరిగింది. అ యితే వెంటనే తేరుకున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు.. అసలేం జరిగిందని చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫ్లెక్సీలు పడిపోతుండటంతో సి బ్బంది వాటిని సరిచేశారు. ఈ విషయంపై వివరణ ఇస్తూ ట్రాఫిక్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని, పడిపోతున్న ఫ్లెక్సీతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా దాన్ని వెనక్కి జరిపారని తెలిపారు.
సరళీకృతమైన అడ్వైర్టెజ్‌మెంట్ పాలసీని పక్కాగా ఆమలుచేయాల్సిన ఈవీడీఎం గత కొద్ది రోజులుగా చేతులేత్తేసింది. జీవో 68 ప్రకారం 15 మీటర్ల కంటే ఎత్తు ఉన్న హోర్డింగ్‌లను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించవద్దు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌లో నిబంధనలు ఉల్లంఘించే యాడ్ ఏజెన్సీలకు భారీ జరిమాన, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.