హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం బలహీనపడి ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ నెల 11వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులులో కూడిన వర్షాలు కురిసినట్టు వాతావారణశాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసిన తెలిపారు.