హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెణకు మంగళవారం మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాలంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే విధంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
దేశంలో సెప్టెంబర్ నెలలోనూ సాధారణం కంటే ఎకువ వర్షాలే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. సాధారణంగా ఏటా సెప్టెంబర్లో 167.9మి.మీ వర్షపాతం కురుస్తుంటుంది.
ఈసారి అదే నెలలో సాధారణం కంటే 109% ఎకువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆదివారం ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా వెల్లడించారు. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 268.1మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5% ఎకువ. తెలంగాణలో ఆగస్టు నెలలో 378.5మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది 75% అధికమని, జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 720.6మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 26% అధికం అని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు 250.6మి.మీ వర్షపాతం కురిసింది. సాధారణం కంటే ఇది 31% ఎకువ.