మోర్తాడ్, మార్చి 8: పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులను గోస పెడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు పసుపునకు మద్దతు ధరను చెల్లించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో శనివారం వేముల పర్యటిస్తుండగా, పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతులు ఆయన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
వెంటనే వేముల కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు ఫోన్ చేసి మాట్లాడారు. పసుపు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని కోరారు. కటాఫ్ ధర నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఆ ధరను తగ్గిస్తున్నారని, సిండికేట్ చేస్తున్న ఆగడాలను అరికట్టాలని సూచించారు.