రాజన్న సిరిసిల్ల, జనవరి 30(నమస్తే తెలంగాణ): ‘ఎలాంటి బెదిరింపులకూ భయపడొద్దు.. మీకు అండగా నేనున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మనమే గెలుస్తం.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోండి’ అని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో సమీక్షించిన ఆయన, శుక్రవారం సైతం వార్డుల వారీగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి, ఆ మేరకు పేర్లను ఖరారు చేశారు. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
అవతలి పార్టీ బెదిరింపులు, కవ్వింపులకు భయపడవద్దని, అన్నింటికీ తానున్నానని, అన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మన సర్కారే వస్తదని ధీమా వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకు అంతా కలిసి శ్రమించాలని సూచించారు. తర్వాత తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడి, ఫొటోలు దిగారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సిరిసిల్లలోని 31వ వార్డుకు చెందిన పాశికంటి లవణ్కుమార్, పాశికంటి రమ్య, వార్డులోని పలువురు నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.