Mancherial | కోటపల్లి, ఏప్రిల్ 24: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు. అందుకు నిరసనగా ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు.
స్పందించిన అధికారులు గ్రామస్థులతో బుధవారం సమావేశమయ్యారు. ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఎస్సై రాజేందర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ గ్రామస్థులతో సమావేశమై మాట్లాడారు. తమ గ్రామానికి రోడ్డు లేకపోవడం ప్రధాన సమస్య అని, రోడ్డు నిర్మిస్తేనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటామని గ్రామస్థులు స్పష్టంచేశారు. రోడ్డు నిర్మాణం అయితేనే ఓట్లు వేస్తామని తేల్చిచెప్పారు.