వరంగల్ : ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో పంట నష్టాల అంచనాలు, కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, జిల్లాల్లో జరుగుతున్న జ్వర సర్వే, దళితబంధు అమలుపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు, రవీందర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్మన్ డా.సుధీర్కుమార్లతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా.బి.గోపి, రాజీవ్‌గాంధీ హనుమంతు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన వడగండ్ల వర్షానికి సుమారు 51వేలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 35వేలకు పైగా రైతులు నష్టపోయినట్లుగా అంచానాకు వచ్చామన్నారు. పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి త్వరగా అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అత్యధికంగా మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, నర్సంపేటలో, పరకాలలో, భూపాలపల్లి జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.రాజకీయాలు చేయకుండా రైతులకు మనోధైర్యం కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు.
కోవిడ్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖా అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షించాలన్నారు. .
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వంద మంది లబ్ధిదారులను ఫిబ్రవరి 5వ తేదీలోపు ఎంపిక చేయాలని సూచించారు.