హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని స్పష్టంచేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన చేతిలో ఉన్నాడని, ఢిల్లీ కూడా తన చేతిలోనే ఉన్నదని బనకచర్లను పూర్తిచేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని, బనకచర్లకు రేవంత్‌రెడ్డి, ఢిల్లీ ఒప్పుకొన్నా తెలంగాణ సమాజం ఒప్పుకోబోదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుతామని, అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని స్పష్టంచేశారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమ వేదికలవుతాయని హెచ్చరించారు. అవసరమైతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని, రైలురోకో చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో హరీశ్ పాల్గొన్నారు. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం, బనకచర్లతో లాభనష్టాలను విద్యార్థి విభాగం నేతలకు వివరించారు. ఈ అంశాలను జిల్లాల్లో ఇతర నాయకులకు వివరించాలని సూచించారు. బనకచర్ల ద్వారా ఏపీ చేస్తున్న నీటి దోపిడీ, సీఎం రేవంత్‌రెడ్డి.. గురువు చంద్రబాబుకు వంతపాడుతున్న తీరును ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.
నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, ఇతర సినీ ప్రముఖులు ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నరు. ఏనాడూ ‘జై తెలంగాణ’ అనని వ్యక్తి రేవంత్‌రెడ్డి. జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటున్నడు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్రెడ్డిగా రేవంత్‌రెడ్డి మిగిలిపోయిండు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబుది మొదటిది, రేవంత్‌రెడ్డిది రెండోది అవుతది. సింహాలు చరిత్ర చెప్పనంత కాలం,
వేటగాడు చెప్పిందే కథ అన్నట్టు ఉంటది.
-హరీశ్‌రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం విద్యార్థి లోకం మరో ఉద్యమం చేపడుతది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమ వేదికలై తెలంగాణ హకులను కాపాడుతయ్. అవసరమైనతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తం. రైలురోకోలు చేస్తం. ఢిల్లీ మెడలు వంచుతం తప్ప తెలంగాణకు హక్కుగా వచ్చే ఒక నీటి చుకను కూడా వదులుకోం.
-హరీశ్‌రావు
ప్రపంచంలో ఏ పోరాటం, ఏ ఉద్యమమైనా విద్యార్థులు, యువతతోనే ప్రారంభమవుతాయని హరీశ్ చెప్పారు. 1969 నాటి తెలంగాణ తొలి ఉద్యమం, మలిదశ, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్ర కీలకమని గుర్తుచేశారు. యువత నుంచే నాయకత్వం పుడుతుందని, రాజకీయాల్లో ఎంతో మంది విద్యార్థి నాయకులకు కేసీఆర్ పదవులిచ్చి ప్రోత్సహించారని చెప్పారు. గాదరి కిశోర్, బాల్క సుమన్‌కు పార్టీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారని, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, ఆంజనేయగౌడ్, చిరుమల్ల రాకేశ్, శ్రీనివాస్‌యాదవ్‌ను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారని గుర్తుచేశారు.
కేసీఆర్ పోరాటం, ఉద్యమాన్ని చరిత్రగా చెప్పాలని, లేదంటే అస్తిత్వంపై దెబ్బ పడుతుందని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ట్యాగ్‌లైన్‌తో రాష్ర్టాన్ని సాధించి గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. రూ.62 లక్షల బడ్జెట్‌ను పదేండ్లలో రూ.3 లక్షల కోట్ల దాకా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. 60 లోకల్, 40 నాన్‌లోకల్ ఉన్న ఉద్యోగాలను 95 శాతం తెలంగాణ బిడ్డలకు పక్కాగా దకేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించింది కేసీఆర్ అని వెల్లడించారు.
రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్, మరో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఏపీ అక్రమంగా కడుతున్న బనకచర్లను ఆపాలని ఎందుకు అడుగరు? అని హరీశ్ ప్రశ్నించారు. ‘బడ్జెట్లో నిధులు తేవడంలో సున్నా. తెలంగాణ హకులు కాపాడటంలో సున్నా? అక్రమ ప్రాజెక్టులను ఆపడంలో సున్నా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా అక్రమ ప్రాజెక్టులను ఆపాలని ఎందుకు అడగరు?’ అని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు పన్నుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ‘పుస్తకాల్లో ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్ పేరును తొలగించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంమార్చారు. బతుకమ్మను తొలగించారు. ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ అంబేదర్ విగ్రహానికి ఏనాడూ దండ వేయలేదు’ అని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పారిపోయారని, ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీలను స్పీకర్‌కు ఇచ్చిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్రెడ్డిగా రేవంత్‌రెడ్డి మిగిలారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయని, నీటి దోపిడీపై ఆయా పార్టీల కుట్రలను బద్దలుకొట్టాలని పిలుపునిచ్చారు.
14 ఏండ్లు చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనేత కేసీఆర్ అంతే తపనతో, అదే దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘రాజకీయ కక్ష సాధింపు నాకు వద్దు. తెలంగాణ ప్రగతి నాకు కావాలని చెప్పిన నాయకుడు, పని చేసి చూపించిన నాయకుడు కేసీఆర్’ అని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కారు రీట్వీట్ చేసిన నల్లబాలు (శశిధర్ గౌడ్) అనే వ్యక్తిని కూడా 20 రోజులు జైలులో పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణకు పూర్వవైభవం రావాలంటే మళ్లీ విద్యార్థులతోనే ఉద్యమం మొదలు కావాలని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ప్రజలకు వివరిస్తే కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తారని స్పష్టంచేశారు.
గోబెల్స్ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాన్ని గ్రామగ్రామాన చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్, ఆంజనేయగౌడ్, బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్వీనాయకులు పడాల సతీశ్, తుంగ బాలు, కడారి స్వామియాదవ్, ధర్మేందర్‌రెడ్డి, పల్ల ప్రవీణ్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, తొట్ల స్వామియాదవ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబూ.. నువ్వు తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి నీ శిష్యుడు సహకరించినా.. నీ దోస్తు బీజేపీ వంతపాడినా.. మేము అడ్డుకొని తీరుతం. తెలంగాణ హక్కుగా ఉన్న నీళ్ల నుంచి ఒక్క చుక్క నీటి బొట్టును కూడా పోనివ్వం. కేసీఆర్ ఉన్నంత వరకు, బీఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.
-హరీశ్‌రావు