హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సరం కానుకగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ పథకంలో భాగంగా 1.31 లక్షల మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు అందజేయనున్నట్టు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, జనవరిలోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు.
జనవరి మొదటి వారంలో యాంత్రీకరణ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రైతులకు యాప్ ద్వారా అవసరమైనంత యూరియా సరఫరా చేస్తామని చెప్పిన మంత్రి, ఈ యాప్ వినియోగంపై రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. యాసంగి సీజన్ రైతు భరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసి, రైతు భరోసా నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 1 వ తేదీ నుంచి జరుగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం ఆయన రవాణాశాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా మాసోత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ప్రతిజ్ఞలు చేయించాలని, స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేశ్, శివ లింగయ్య, డీటీసీలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.