హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం బరాజ్‌లను పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే పునరుద్ధరణ పనులు జరుగుతాయని, ప్రభుత్వం ఇప్పటికే జాతీ య సంస్థలు, నిపుణుల సంస్థలను పునరుద్ధరణ పనుల్లో పాల్గొనాల్సిందిగా కోరిందని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో కాళేశ్వరం పునరుద్ధణతోపాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునరుద్ధరణ ప్రక్రియ ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా ఉంటుందని, ఏదైనా వ్యత్యాసం లేదా ఆలస్యం జరిగితే సదరు సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి నుంచి ఇంజినీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే దానిపై ఈ నెల 22 నాటికి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. న్యాయపరమైన అంశాలపరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కెడబ్ల్యూడీటీ-2) ముందు జరుగుతున్న విచారణల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ సమర్పణలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధంచేయాలని, ఢిల్లీలోని న్యాయ బృందంతో, సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని, వాదన ల్లో ఏకరూపత ఉండాలని అధికారులను ఆదేశించారు. సమ్మక-సరక ప్రాజెక్టు, సీతమ్మసాగర్, మొడికుంటవాగు, చనాక-కొరాటా, దేవాదుల ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు.