హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఇటీవల బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేస్తామని, పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామని, బదిలీల అప్పీళ్లను పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, జాక్టో నేతలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయా సంఘాల నేతలు వెంకటేశంతో భేటీ అయి పలు అంశాలను ప్రస్తావించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపి, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు జంగయ్య, సదానందంగౌడ్, అశోక్‌కుమార్, లింగారెడ్డి, రాధాకృష్ణ, నాగిరెడ్డి, పోచయ్య, శ్రీనివాస్, కొండయ్య పాల్గొన్నారు.
బదిలీ అధికారులను వెనక్కి తేవాలి : టీజీవో
ఎన్నికల సంఘం సూచనల మేరకు పార్లమెంట్ ఎన్నికల ముందు సుదూర ప్రాంతాలకు బదిలీ అయిన అధికారులను వెనక్కి తీసుకొచ్చి, ప్రస్తుతం జరుగబోయే బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో)ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీజీవో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిలను కలిసి 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలను హైదరాబాద్ నగరంలో భాగంగా కాకుండా, ప్రత్యేక స్టేషన్లుగా పరిగణించి ఉద్యోగ సంఘాల బాధ్యులకు బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, ఎనుగుల సత్యనారాయణ, అసొసియేట్ అధ్యక్షుడు శ్యామ్, కోశాధికారి ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, పరమేశ్వర్‌రెడ్డి, నరహరిరావు, లక్ష్మణ్, శిరీష, వనజ, ఏంజిలారెడ్డి పాల్గొన్నారు.