మహబూబ్ నగర్ అర్బన్ : ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు ( Local Body Elections ) జరిపేలా అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికలు జరిపేలా చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former Minister Srinivas Goud) స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరంగల్ ( Warangal Meeting ) సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వల్లే ఎన్నికలు వచ్చేలా చేస్తామని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఈనెల 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు పార్టీశ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్మాలంటే అనేక కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో కరోనాలో సైతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకున్నామని పేర్కొన్నారు. వర్షం పడి మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నామని అన్నారు. కనీసం గన్ని బ్యాగులు కూడా ఇస్తలేదని దుయ్యబట్టారు. పండించిన పంటలు అమ్ముకోవాలన్న రైతులు గోస పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నర్సింలు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, పార్టీ నాయకులు మల్లు నరసింహ రెడ్డి, ఆంజనేయులు, మైనార్టీ నాయకులు మోసిన్, హాన్వాడ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.