హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు సాధించడమే తమ అంతిమ లక్ష్యమని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన జాతీయ ఓబీసీ సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమాల ద్వారానే హక్కులు పరిరక్షించబడతాయని, ఓబీసీల హక్కుల సాధనకు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ సాధన కోసం ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుజాన్సిం గ్, రాష్ట్ర నాయకులు ఉన్నవ సుబ్బారావు, చాటపర్తి పోసిబాబు, గిడ్డనాయుడు, పరశురాం, సుధాకర్సింగ్, హైమారావు తదితరులు పాల్గొన్నారు.