చిన్నకోడూరు, ఏప్రిల్ 11 : అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రుల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తమకు జరిగిన పంట నష్టం వివరాలను రైతులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు రోజులుగా కురిసిన అకాల వర్షం, రాళ్ల వాన మూలంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు.