హైదరాబాద్, జులై 7 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ దిగుమతులపై ఇటీవల తగ్గించిన సుంకాలను మళ్లీ పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దక్షిణాది రాష్ర్టాలతోపాటు ఈశాన్య రాష్ర్టాల వ్యవసాయ మం త్రులతో కలిసి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు పంపినట్టు వెల్లడించారు.
ఆయిల్‌పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని, రైతుల పక్షాన కేంద్రానికి గళం వినిపించాలని కోరారు. కేంద్రం ఇటీవల ఆయిల్‌పామ్‌పై 27% ఉన్న దిగుమతి సుంకాన్ని 10శాతానికి తగ్గించిందని, దీంతో ఆయిల్‌పామ్ రైతులకు నష్టం కలుగుతున్నదని వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని లేఖలో కోరినట్టు తుమ్మల వెల్లడించారు.