బాల్కొండ : ఇటీవల జరిగిన వేల్పూర్ సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టినా హైకోర్టు ఈ కేసులన్నీ అక్రమమని స్పష్టం చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరైన కార్యకర్తలను మహేష్, నితీష్,లాల, రహమాన్, గంగాధర్ గౌడ్ లను వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) మంగళవారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి వేల్పూర్‌లోని తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడితే అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, దాడిని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసులు నమోదు చేయడం శోచనీయమని ఆరోపించారు. దీనిని ప్రజా పాలన అంటారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి చేస్తున్న కక్షసాధింపు చర్యలని స్పష్టమవుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వాటిని తాము న్యాయవ్యవస్థలో ధైర్యంగా ఎదుర్కొంటామని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం,విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఇకనైనా రేవంత్ రెడ్డికి ,కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా కాకుండా చట్టానికి లోబడి పని చేయాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.