CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ): ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, ఢిల్లీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కడా హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఢిల్లీ ప్రజలకు రెండు గ్యారెంటీలు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో విజయవంతంగా హామీలు అమలు చేశామని, ఇప్పుడు ఢిల్లీలోనూ అలాంటి హామీలే ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణలో నిలిచిన 161 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కేంద్రమంత్రి భూపేందర్ యా దవ్ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ లో భూపేందర్తో రేవంత్రెడ్డి భేటీ అయ్యా రు. కేంద్ర భారీపరిశ్రమలశాఖ మంత్రి డీ కుమారస్వామితో సమావేశమైన సీఎం హైదరాబాద్లో 100 శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కోరారు. ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న రేవంత్రెడ్డి అక్కడి నుంచి విదేశాలకు పయనమయ్యారు. సింగపూర్, దుబాయిలో పర్యటించిన తర్వాత దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో పాల్గొంటారు.