హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా భవనం సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ నూతన భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టే వరకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచుతూనే ఉంటామన్నారు. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, అందులో పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు.
కేసీఆర్ ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వద్దిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన గొప్పతనాన్ని భవిష్యత్ తరాల వాళ్లు తెలుసుకునేందుకు గాను హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగులలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ స్మృతి కేంద్రాన్ని గొప్పగా ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితోనే అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే దృఢ సంకల్పంతో 1,000 గురుకులాలను నడిపిస్తున్నారని వివరించారు. అసెంబ్లీ తీర్మానం పట్ల సానుకూల నిర్ణయం వచ్చే వరకు టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచుతూనే ఉంటుందని వద్దిరాజు స్పష్టం చేశారు.