చిక్కడపల్లి, అక్టోబర్ 3: ట్రిపుల్ ఆర్ విస్తరణలో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల రాజశేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, రాష్ట్ర గీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, రైతు సంఘం నాయకుడు సాగర్ తదితరలు హాజరై మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు కోరుతున్న విధంగా ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు అలైన్మెంట్ మార్చాలని వారు డిమాండ్ చేశారు.
లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారు నిర్వహించే ప్రతి పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పారు. అలైన్మెంట్ మార్చకుంటే రైతులు కోట్లాది రూపాయిల విలువైన భూములు కోల్పోతారని తెలిపారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చిస్తామని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినీ కదిలించినా దుఖంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతులను మోసం చేసిందని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ భూమినే నమ్ముకొని జీవించే రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. రైతులు నిర్వహించే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఐక్యవేదిక నాయకులు దామోదర్‌రెడ్డి, బురుగ కృష్ణారెడ్డి, బండారు నర్సింహ, శ్రీశైలం, సుందర్‌రెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.