Telangana Budget : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది.. స్థానికంగాను, విదేశాల్లోనూ సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన ప్రపంచస్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాల అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఈ విషయం చెప్పారు.
ఇదే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్లో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ‘తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయం (Skills University of Telangana)’ ను స్థాపించి, నడిపించాలని నిర్ణయిచిందని భట్టి తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశ్రమలకు అవసరమైన 17 రకాల నైపుణ్యాలను నేర్పనున్నట్లు చెప్పారు. వీటిలో సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులు ఉంటాయన్నారు.
ఈ స్కిల్ యూనివర్సిటీ నేరుగా పరిశ్రమలతో అనుసంధానించబడి ఉంటుందని.. అధ్యయనం, ఆచరణల మధ్య అంతరంలేని విధంగా ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.