హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను ఆయన ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 25 నుంచి 29 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పారు. ఎగ్జిబిషన్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రదర్శన లో మట్టి పాత్రలు, వెదురు వస్తువులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ఆరగించారు.