హైదరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి, పార్టీ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా.. దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా, ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి, సోదరికి అలాగే సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు తెలుపుతున్నాని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ప్రతీ బీఆర్ఎస్ సైనికుడికి హృదయపూర్వక వందనం. బీఆర్ఎస్ నిజమైన బలం మన దృఢమైన క్యాడర్లో ఉందని మన కార్యకర్తులు మరోసారి నిరూపించారన్నారు. తెలంగాణ గౌరవాన్ని, అస్థిత్వాన్ని, భవిష్యత్తును అందరం కలిసి కాపాడుకుందామంటూ ట్వీట్ చేశారు.
రౌడీ మూకలు దాడి చేసినా…రాళ్ళు రువ్వినా…
దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా…
ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి @BRSparty సోదరుడికి, సోదరికి అలాగే సోషల్ మీడియా లో అండగా నిలిచిన యోధులకి వందనాలు!
A heartfelt salute to every solider of BRS who bravely stood up against the…
— KTR (@KTRBRS) September 13, 2024
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్లే అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డే చేయించారని కేటీఆర్ అన్నారు. గత కొన్నిరోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్‌రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని విమర్శించారు. కౌశిక్‌రెడ్డిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? అని ప్రశ్నించారు.
కౌశిక్‌రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి, పోలీసుల సాయంతో వచ్చిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ర్టాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టంచేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డికి ఏమైనా జరిగిగే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో పక్కా ప్లాన్‌తోనే వచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారని కేటీఆర్ విమర్శించారు. పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్‌రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందని ధ్వజమెత్తారు. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూస్తే జాలేస్తుందని, అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని చూస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని హెచ్చరించారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం దాడులకు తెగబడుతున్నదని, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వమే దాడులు చేయించడమా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాసి పెట్టుకుంటామని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని స్పష్టంచేశారు. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసులు.. అరికెపూడి గాంధీని మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితోనే బీఆర్ఎస్ సహా తెలంగాణ ప్రజలు ఉన్నారని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ గూండాల దౌర్జన్యాలు, దాడులు, పిరికిపంద చర్యలని పేర్కొన్నారు. ఆ చర్యలు గులాబీ సైనికుల మనోనిబ్బరాన్ని దెబ్బతీయలేవని తేల్చిచెప్పారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా పార్టీ సైనికుల పోరాటానికి నీకు నచ్చిన పేరు పెట్టుకో’ అని సవాల్ విసిరారు. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని కాంగ్రెస్ అవినీతి, దుర్మార్గ పాలన నుంచి తాము కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ను ఏదో చేయాలన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డి చేసే పిచ్చి పనులు.. తమ సంకల్పానికి మరింత ఆజ్యం పోస్తాయని చెప్పారు.