కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య నేపథ్యంలోనే తాము మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.