హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం మౌనం వహించింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపు అంశంపై మరోసారి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు తెలిపింది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనబాట నేపథ్యంలో శుక్రవారం జేఏసీ నేతలతో సర్కార్ చర్చలు జరిపింది. ప్రజాభవన్‌లో జరిగిన చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని చర్చించారు. సీపీఎస్ రద్దు అంశాన్ని జేఏసీ నేతలు ప్రస్తావించగా.. డిప్యూటీ సీఎం మౌనం వహించినట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. చర్చల్లో భాగంగా జేఏసీ నేతలు పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బిల్లులు, హెల్త్‌కార్డులు, సీపీఎస్ రద్దు అంశాలను ప్రస్తావించారు. స్పందించిన భట్టి.. తాను రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఉద్యోగ సంఘాల నేతలతోనూ సీఎం భేటీని ఏర్పాటుచేస్తామని చెప్పినట్టు జేఏసీ నేతలు తెలిపారు.
ఉద్యోగుల బిల్లులన్నీ ఇప్పుడే ఇవ్వలేం..
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏకమొత్తంగా చెల్లించలేమని, సర్వీస్‌లో ఉన్నవారు కాస్త ఓపికపట్టాలని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాల నేతలతో అన్నట్టు తెలిసింది. ప్రస్తుతం పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించనున్నామని, వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలను ఏకమొత్తంగా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పినట్టు సమాచారం. జూన్ 2 నుంచి హెల్త్‌కార్డులు అమలుచేస్తామని, రెండో పీఆర్సీకి సం బంధించి శివశంకర్ కమిటీ నివేదికను తెప్పించుకుని జేఏసీ ప్రతినిధులను పిలిచి నిర్ణయం తీసుకుంటామ ని హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి.. వడ్డీలపై మాట్లాడుతూ.. ప్రతి నెలా తాము రూ.8,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నట్టు చెప్పారు. కానీ, గతంలో సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ఇలా ప్రభుత్వ పెద్దలే తలోమాట మాట్లాడటంపై ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, బీ శ్యామ్, ఎస్ఎం హుస్సేని, రవీందర్‌రెడ్డి, సురేశ్‌కుమార్, దాస్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించండి : లచ్చిరెడ్డి
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల 45 సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(లచ్చిరెడ్డి వర్గం) డిమాండ్ చేసింది. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలుచేయాలని.. పెన్షనర్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏకకాలంలో చెల్లించాలని కోరింది. శుక్రవారం జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్థికభారం, సత్వరం పరిష్కరించాల్సిన అంశాలను సర్కార్ ముందుంచారు. సీపీఎస్ రద్దు, పెండింగ్ ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. రెవెన్యూలో 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, రెవెన్యూలో తొలగించిన 632 మంది కంప్యూటర్ ఆపరేటర్ల, ఎఫ్‌టీఎస్‌ల సేవలను పునరుద్ధరించాలని, ధరణి ఆపరేటర్ల సేవలను కొనసాగించాలని కోరారు. ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. భేటీలో జేఏసీ సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్, కే రామకృష్ణ, ఎస్ రాములు, బాణాల రాంరెడ్డి, పెంటయ్య, రమేశ్, నిర్మల, హబీబ్ మియా, మహిపాల్‌రెడ్డి, దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.