హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ నెల 3 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పట్టణాలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇందుకోసం 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశామన్నారు.
ఈ టీంలు ప్రజలతో కలిసి ఆయా కాలనీలు, బస్తీలలో పర్యటించి పారిశుధ్య నివారణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు రహదారులపై చెత్తను వేస్తున్నారని, ఆయా ప్రాంతాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్,బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ నగేష్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.