హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్‌బోర్డు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాలేజీల యాజమాన్య సంఘాలు తిరుగుబాటు చేశాయి. ఇంటర్ పరీక్షలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. సీసీ కెమెరాలు ఏర్పాటుచేయబోమ ని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలకు సహకరించబోమని స్పష్టంచేశాయి. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీశ్ మా ట్లాడారు. ఫైర్ ఎన్వోసీ నుంచి ప్రభుత్వం మి నహాయింపు ఇచ్చినా, జరిమానాల పేరుతో యాజమాన్యాలను బోర్డు ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని వాపోయారు. పెండింగ్‌లోని స్కాలర్‌షిప్పులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి డీఐఈవోలను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని గౌరి సతీశ్ ప్రకటించారు.
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షలకు మూడు రో జులు మాత్రమే మిగిలి ఉంది. కాలేజీల తిరుగుబాటుతో ప్రాక్టికల్స్ జరుగుతాయా..? లే దా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.