కరీంనగర్ : భావితరాల బాగు కోసం బీఆర్ఎస్కు మరోసారి అండగా నిలవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ (Karimnagar District) రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ( Brs plenary meeting,) సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సమైక్య పాలనలో ఇక్కడి బొగ్గు(Coal), నీరు(Water), నిధులు(Funds), నియామకాలు దోచుకుని తెలంగాణను అన్ని రంగాల్లో అన్యాయానికి గురిచేశారని అన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యం పై నమ్మకం పోయే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో వచ్చిన మార్పును ప్రజలు గమనించేలా చైతన్యం చేయాలని సూచించారు.
స్వయం పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచామని, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ కు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమి పెరుగకున్నా భూమికి బరువయ్యే పంటలు(Crops) పండుతున్నాయని వెల్లడించారు.
గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 90కి పైగా సీట్లు సాధించి వరుసగా 3వ సారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక రోజులు సీఎంగా ఉన్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. పార్టీని మనం కాపాడుకుంటే పార్టీ మనను కాపాడుతుందన్నారు. ఢిల్లీ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ ఆగమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ ను హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా తీర్చిదిద్దడమే తన బాధ్యతని హామీ ఇచ్చారు.ప్లీనరీలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్,ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.