అచ్చంపేట, ఏప్రిల్ 13 : కృష్ణానది నీటివాటాలో ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేస్తూ.. నల్లగొండకు తరలించే కుట్రలను అడ్డుకునేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో జలవనరుల సాధన సదస్సు నిర్వహించారు. రాఘవాచారి మాట్లాడు తూ.. నల్లగొండకు నదీజలాలు తరలిపోతున్నా సీఎం రేవంత్ సొంత జిల్లాకు ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరుకు నీటివాటాలో జరుగుతున్న అన్యాయంపై ప్రొ ఫెసర్ హరగోపాల్‌తో కలిసి జనవరిలో నే సీఎంకు లేఖ అందజేసినా చలనం లేదని ఆరోపించారు. పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడని, ఏదైనా మంచి చేస్తాడని ఆశించిన ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ ఉన్న నీళ్లను నల్లగొండకు ధారాదత్తం చేయడం విచారకరమని అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నోరుమెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు.