చేనేత కళకు కేరాఫ్ అడ్రస్ సిరిసిల్ల. అగ్గిపెట్టెలో పట్టే చీర పుట్టించి తెలంగాణ నేతన్న ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నల్ల పరంధాములు సిరిసిల్ల బిడ్డే. ఆయన వారసుడైన నల్ల విజయ్ తండ్రిబాటలోనే నడుస్తున్నాడు. నూతన ఆవిష్కరణలు చేస్తూ.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ యువ కళాకారుడు ఈసారి సరికొత్త థీమ్‌తో ముందుకొచ్చాడు. వస్త్రంపై క్యూఆర్ కోడ్ నేసి.. ఔరా! అనిపించుకున్నాడు. దీనిని స్కాన్ చేస్తే రాష్ట్రం ఏర్పాటైన తొలి పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి కండ్లముందు ప్రత్యక్షమవుతుంది. వినూత్న ఆలోచనతో నేతన్న పటిమను చాటిన విజయ్ తన ప్రస్థానాన్ని బతుకమ్మతో ఇలా పంచుకున్నారు..

మా సిరిసిల్లకు కేటీఆర్ గారు ఎమ్మేల్యే కావడం మా అదృష్టం. చేనేతకు మంచి ప్రోత్సాహం అందించారు. కొత్తగా చేసే ప్రతి పనిని మెచ్చుకోవడం ఆయన నైజం. అందుకే క్యూఆర్ కోడ్ వస్త్రం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశా. బాగుందంటూ ఓ అన్నలా భుజం తట్టారు.
అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి చేనేత గొప్పతనాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములుకి జన్మించడం నా అదృష్టం. నాన్న చేసే చేనేత పనిని చూస్తూ పెరిగాను. పదో తరగతి పూర్తి కాగానే నేనూ మగ్గం పని ప్రారంభించా. నాన్నే దగ్గరుండి నాకు శిక్షణనిచ్చారు. అలా 2008లో పూర్తిస్థాయిలో మగ్గం అందుకున్నాను. నాన్న నేసినట్టుగానే నేను కూడా అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అందరిలా కాకుండా ఈ వృత్తికి వన్నె తేవాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాను. 2012లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను నేసిన అగ్గిపెట్టెలో పట్టే చీరను ప్రదర్శించా. అందరూ అభినందించారు. నా ప్రయోగాలు కొనసాగిస్తూ వచ్చాను. ఉంగరంలోకి దూరిపోయే చీర, దబ్బనం బెజ్జంలో పట్టే చీర వారం పది రోజుల్లోనే తయారు చేశాను.

నాన్న గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన చేనేతను బతికించడమే నాన్నకు నేనిచ్చే నివాళిగా భావించాను. ఈ ప్రయత్నంలో ఉసరవెల్లిలా రంగులు మార్చే చీరలు, ఫర్ఫ్యూమ్ అద్దిన చీర, 200కు పైగా రంగులతో నేసిన చీర, అరటినారతో శాలువ ఇలా వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాను. కష్టపడిన వాడికి ఎన్నటికైనా గుర్తింపు వస్తుందన్నది నా నమ్మకం. చేనేత రంగంలో నా కృషిని గుర్తించి స్వరాష్ట్రం సాధించిన తొలి ఏడాదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ‘తెలంగాణ కళారత్న’ అవార్డుతో సత్కరించారు. నేతన్నల బతుకులు తెలిసిన ఉద్యమనేత చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం.
ఈ రాష్ట్ర పౌరుడిగా నావంతు పాత్ర పోషించాలనే ఆలోచనతో ఈ ‘క్యూఆర్ కోడ్’ వస్త్రం తయారు చేయడానికి సిద్ధమయ్యాను. అందుకోసం గతంలో ఇలాంటివేమైనా ఉన్నాయా అని సామాజిక మాధ్యమాల్లో వెతికాను. చాలావరకు వస్ర్తాలపై రకరకాల బొమ్మలు ఉండటం గమనించాను కానీ, ఇలా క్యూఆర్ కోడ్ ఉండే దుస్తులు కనిపించలేదు. నా వద్ద చీరలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరిని సంప్రదించి, నా ఆలోచనలు వారితో పంచుకున్నా. వారు నాకు కావాల్సిన సమాచారంతో క్యూఆర్ కోడ్‌ను సిద్ధం చేసి ఇచ్చారు.
ఉచితంగా తీసుకోవడం ఇష్టంలేక రూ.25వేలు వారికిచ్చి కొనుక్కున్నాను. 2025 అక్టోబర్‌లో సుమారు 20 రోజుల పాటు కష్టపడి వస్త్రంపై పోగులతోనే క్యూఆర్ కోడ్‌ను పొందుపరిచాను. ‘పోగు బంధంతో ఫోన్ బంధం’ కాన్సెప్ట్‌తో దీనిని తయారు చేశాను. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే… కాళేశ్వరం, యాదగిరిగుట్ట, తెలంగాణలోని 33 జిల్లాల్లోని ప్రత్యేకతలు, బతుకమ్మ, బోనాలు, మన సంస్కృతి, హైదరాబాద్ అభివృద్ది ఇలా ఒకటేమిటి పదేండ్లలో మన స్వరాష్ట్రం సాధించిన ప్రగతి సాక్షాత్కరిస్తుంది.

నేను తయారు చేసిన ఈ క్యూఆర్ కోడ్ వస్త్రం తెలంగాణ ప్రగతికి అద్దం పడుతుంది. దీన్ని పాఠశాల విద్యార్థులు, కార్యాలయాల్లో అధికారులు గోడకు తగిలించుకొని వాడుకోవచ్చు. విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన గుర్తుగా వాళ్లకు దీనిని బహుమతిగా ఇస్తే.. మన రాష్ట్రం గొప్పదనం ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ కల సాకారమయ్యాక పదేండ్లపాటు చేనేత రంగం బాగున్నది. ఇతర దేశాల ప్రతినిధులు మా సిరిసిల్లకు వచ్చేవాళ్లు.
ఇక్కడి వీధుల్లో తిరిగి మా శ్రమను గుర్తించి, మా పనిని మెచ్చుకొని పైసలు పెట్టి మరీ చీరలు కొనుక్కునేవాళ్లు. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఆర్డర్లు రాకపోవడంతో నెలకు మూడు నాలుగు చీరలే నేస్తున్నాం. ప్రస్తుతం నాకున్న నాలుగు మగ్గాల్లో ఒకటి మాత్రం ఈ తరహా ప్రయోగాలకు ఉపయోగిస్తున్నా. చేనేత మా అస్తిత్వం. మా నాన్నలాగా నేను దీన్ని నమ్ముకున్నా.. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న నా కొడుకు కూడా భవిష్యత్తులో చేనేతరంగంలోనే స్థిరపడాలన్నదే నా కోరిక.
– రాజు పిల్లనగోయిన