Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు నుంచే బుకింగ్స్, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో సినిమా హాట్ టాపిక్‌గా మారింది.ఇలాంటి సమయంలో ‘పెద్ది’ చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేయడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు నిర్మాతలకు అనుమతి లభించింది. ఈ ప్రత్యేక ప్రదర్శనల కోసం ఒక్కో టికెట్ గరిష్ట ధరను రూ.600గా నిర్ణయించారు. దీంతో అభిమానులు విడుదలకు ముందే ‘పెద్ది’ని చూసే అవకాశం దక్కనుంది. ఇక సాధారణ ప్రదర్శనల విషయానికి వస్తే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి కేవలం పది రోజుల పాటు మాత్రమే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం యథావిధిగా సాధారణ టికెట్ ధరలకే విక్రయాలు జరగనున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ, నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘పెద్ది’ తొలి పది రోజుల వసూళ్లపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక సినిమా విషయానికి వస్తే, ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, రామ్ చరణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించనుండటం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి లభించడంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ ప్రయాణం మరింత ఘనంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.