Vijay | తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకుల పట్ల అభిమానుల ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పట్ల ఓ అభిమాని చూపించిన అతి అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంట్లోని పూజా మందిరంలో విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తున్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. తిరుచ్చికి చెందిన టీవీకే కార్యకర్త సుకుమార్ షణ్ముగం తన అభిమాన నటుడు విజయ్ను దేవుడిగా భావిస్తూ ఇంట్లో ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. పూజా గదిలో విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, దేవతా మూర్తులకు చేసే విధంగానే నిత్యం హారతులు ఇస్తూ పూజలు నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది అతిగా మారిన అభిమానం అని విమర్శిస్తున్నారు. నటులను, రాజకీయ నాయకులను గౌరవించడం వరకు బాగానే ఉన్నా, దేవుళ్లతో సమానంగా భావించి పూజించడం సరైన సంస్కృతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తమిళనాడులో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కావు. సినీ తారలకు ఆలయాలు నిర్మించడం అక్కడ చాలా కాలంగా కొనసాగుతున్న సంస్కృతి. గతంలో ప్రముఖ నటి ఖుష్బూ కోసం తిరుచ్చిలో అభిమానులు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. అనంతరం కొన్ని వివాదాల కారణంగా అదే ఆలయం ధ్వంసమైంది.
అలాగే ఒకప్పుడు తమిళ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నమిత కోసం కూడా అభిమానులు ఆలయాన్ని నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం ఎం.జి. రామచంద్రన్‌కి కూడా అభిమానులు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. చెన్నై సమీపంలోని అవడి ప్రాంతంతో పాటు మధురై జిల్లాలోనూ ఎంజీఆర్‌కు విగ్రహాలు ఏర్పాటు చేసి నేటికీ పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాలతో కూడిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు ప్రత్యేకంగా గుడి నిర్మించడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు.\
విజయ్ విగ్రహానికి టీవీకే కార్యకర్త పూజలు.. వీడియో వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ విగ్రహానికి ఓ అభిమాని ఇంట్లో పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే పార్టీ కార్యకర్త తన పూజా మందిరంలో విజయ్ బొమ్మ… pic.twitter.com/YFvdDkz3rH
— ChotaNews App (@ChotaNewsApp) June 2, 2026