US vs Iran : డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) దాడులతో పశ్చిమాసియా (West Asia) మళ్లీ దద్దరిల్లింది. ఓవైపు శాంతి కోసం చర్చలు జరుపుతూనే అమెరికా- ఇరాన్ (USA-Iran) దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్.. కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అంతకుముందు అమెరికా ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. కువైట్‌లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలను ఇరాన్ (Iran) లక్ష్యంగా చేసుకుంది.
కువైట్ వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. దాంతో ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. మరోవైపు బహ్రెయిన్‌లో కూడా సైరన్లు మోగాయి. దాంతో సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఖేష్మ్ ద్వీపంపై దాడికి ప్రతిస్పందనగానే.. తాము అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్జీసీ (IRGC) పేర్కొన్నది.
శత్రు దురాక్రమణలకు.. భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ప్రజలను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు శత్రువుల స్థావరాలను, ప్రయోజనాలను బూడిద చేసేందుకు సైతం తాము వెనుకాడబోమని పేర్కొన్నది. ఇక బెహ్రాయిన్లోని యూఎస్ నేవీ ఐదో ప్లీన్ ప్రధాన కార్యాలయంపైనా, ఆ ప్రాంతంలోని మరో అమెరికా వైమానిక స్థావరంపైనా క్షిపణులు, డ్రోన్లతో విజయవంతంగా దాడి చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది.
అయితే అమెరికా సెంటకామ్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఐఆర్జీసీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని తెలిపింది. అమెరికన్ బలగాలపై ఇరాన్ జరిపిన దాడులన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నది. దాని దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఆత్మరక్షణ కోసమే ఖేష్మ్ ద్వీపంపై దాడులు చేశామని చెప్పింది.