హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో విశ్వకర్మల జీవితం అత్యంత దుర్భలంగా మారిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం జీరోఅవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో కులవృత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీరిలో స్వర్ణకారుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని అన్నారు. బంగారం ధర రూ.1.50 లక్షలకు పెరగడంతో దొంగబంగారం కొంటున్నారంటూ స్వర్ణకారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. దీనిని తట్టుకోలేక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కమ్మరి, వడ్రంగి వృత్తులవారు ఫారెస్ట్ అధికారుల వేధింపులతో దెబ్బతింటున్నారని తెలిపారు. కులవృత్తులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించి ఈ జాతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి: ఎల్ రమణ
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రూ.1000 కోట్ల నిధుల కేటాయింపు హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఉపనేత ఎల్ రమణ డిమాండ్ చేశారు. ప్రత్యేక ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఐటీ శాఖ మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. వివిధ దేశాల్లో ప్రమాదాల వల్ల చనిపోయిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఇచ్చే రూ.5లక్షల పరిహారాన్ని అందరికీ వర్తింపజేయాలని కోరారు. ప్రవాస భారతీయ దివస్ మాదిరిగా, తెలంగాణ ప్రవాస్ దివస్‌ను నిర్వహించాలని సూచించారు.
కొత్త పింఛన్లు రావడం లేదు: నవీన్‌రెడ్డి
రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి విమర్శించారు. వితంతువులు, వికలాంగులకు కొత్తగా ఫించన్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఫించన్లు పెంచకపోగా.. ఉన్న వాటిని సైతం సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల్లో సర్పంచ్‌లకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.