కరీంనగర్: తెలంగాణ వనరులను దోచుకునేందుకు మళ్లీ వస్తున్న పార్టీలు, నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఇక్కడి సంపదను, వనరులను దోచుకెళ్లడానికి వస్తున్నారని దుయ్యబట్టారు.
వైఎస్సార్ పార్టీ షర్మిల, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పాల్ లాంటి వ్యక్తులు తెలంగాణ గడ్డపై రకరకాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు ఖమ్మంలో సభ నిర్వహించడంతో పాటుగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా కలిపేందుకు కేంద్రాన్ని బ్లాక్మెయిల్చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
ఆంధ్ర నుంచి వేర్వేరూ వేశాల్లో వస్తున్న నాయకులు ఒకే గొడుగుకు చెందిన వారని విమర్శించారు. వీరి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూర దృష్టితోతెచ్చిన అనేక సంస్కరణల వల్ల హైదరాబాద్ బ్రాండ్ఇమేజ్ పెరిగిందని అన్నారు. దేశంలో అత్యధిక జీఎస్టీని తెలంగాణ చెల్లిస్తుందని ఆయన గుర్తు చేశారు.