న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) .. ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఆమె తరపున న్యాయవాది సోమా భరత్(Lawyer Soma Bharat).. ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈడీ(ED) అడిగిన 12 రకాల డాక్యుమెంట్లను వాళ్లకు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చట్ట ప్రకారం విచారణ జరగట్లేదు, అక్రమంగా కవిత ఫోన్ను ఈడీ సీజ్ చేసిందన్నారు. ఈడీ విచారణ అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటీషన్ వేశామని, ఆ తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. మహిళను ఇంటి వద్దే విచారించాలని, ఆఫీసుకు రావాలని సమన్లు ఇచ్చే పవర్స్ ఈడీకి లేవన్నారు.
తమ హక్కులు సాధించడానికే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్(Writ Petition) వేశామన్నారు. ఇంటికి వచ్చి విచారించాలన్నది మహిళలకు ఉన్న హక్కు అని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్(BRS) మహిళా నేతను హరాస్(Harass) చేస్తున్నట్లు సోమా భరత్ ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరుకాబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. చట్టం ప్రకారం మహిళల్ని ఇంటి వద్దే విచారించాలని ఆయన గుర్తు చేశారు.
ఇదో ఫాబ్రికేటెడ్ కేసు(Fabricated Case) అని.. రాజకీయ ప్రత్యర్థుల్ని(Political Opponents) వేధించేందుకు ఈ కేసు వేసినట్లు ఆయన ఆరోపించారు. ఈడీపై వేసిన పిటిషన్ గురించి ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారించనున్నట్లు ఆయన చెప్పారు. కచ్చితంగా సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే విచారించాలన్న నిబంధనను ఈడీ ఉల్లంఘించినట్లు సోమా భరత్ తెలిపారు.
ఈడీ అన్ని డాక్యుమెంట్లను తీసుకుని అక్నాల్జ్ చేసినట్లు సోమా భరత్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై కేంద్రం కక్ష కట్టి కేసులు పెట్టిందన్నారు. ఆధారాల్లేకుండా ఈ కేసులో కవితను ఇరికించాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాత్రి ఎనిమిదిన్నర వరకు కవితను విచారించి నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయన ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి విచారణ చేయరాదన్నారు.