పాలకవీడు, సెప్టెంబర్ 21 : అల్మట్టి డ్యాం ఎత్తుపెంపును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం శివారులో జరుగుతున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులను ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆల్మట్టి డ్యాం పెంపుపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, దీనిపై కృష్ణా ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. తాను సోమవారం ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
కృష్ణా, గోదావరి జలాల కోసం తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు సంసిద్ధంగా ఉన్నామని, దీనిపై త్వరలో కార్యాచరణ చేపడుతమని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ బరాజ్ పునరుద్ధరణ పనులు చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పారు. గుండెబోయిన గూడెం గ్రామశివారులో రూ.302 కోట్లతో నిర్మిస్తున్న జాన్‌పహాడ్ లిఫ్ట్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 21 : పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ద్వారా కుప్పంకు నీరు ఇచ్చామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లో నిజం లేదని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఘనత దివంగత వైఎస్ఆర్దేనని, కుడి కాలువ కోసం 10,628 ఎకరాలు, ఎడమ కాలువ కోసం 10,343 ఎకరాల భూసేకరణ జరిగిందని గుర్తుచేశారు. పోలవరం కేంద్రం నిర్మించాల్సి ఉందని, కానీ చంద్రబాబు తీసుకొని నష్టం చేకూర్చారని మండిపడ్డారు.