హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించిందని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు రోజులుగా పండుగ రద్దీకి తగట్టు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి 13 వరకు 5,375 స్పెషల్ బస్సులు నడిపామని వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు రాకుండాముందస్తు చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, బస్సుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని అందించామని వివరించారు.
రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతున్నదని తెలిపారు. 9న 721, 10న 1645, 11న 1180, 12న 1109, 13న (6 గం.ల వరకు) 720 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేసినట్టు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు అవరోధాలు తలెత్తకుండా ఉండేందుకు ఈనెల 18, 19న ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.