హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి.. మావోయిస్టు ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు ఏఐవైఎఫ్ కార్యకర్తలకు గాయాలు కాగా, కార్యకర్తలను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. దండకారణ్యంలో మావోయిస్టులతోపాటు, గిరిజనుల నెత్తురు ఏరులై పారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే ఈ నరమేధాన్ని కేంద్రం సృష్టిస్తున్నదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.