KCR : రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మిషన్ మోడ్‌లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరైడ్ సమస్యకు వ్యతిరేకంగా చేసిన జలసాధన ఉద్యమం గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పైసా ఖర్చు లేకుండా, హైదరాబాద్‌లో ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్ భగీరథ నీళ్లు అందించామని చెప్పారు.
‘రాష్ట్రంలో మంచినీటి సరఫరా. ఇది చాలా అద్భుతమైన స్కీమ్. మేం ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసినం. ఎందుకంటే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. నల్లగొండ జిల్లాలో తీవ్రమైన ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు జరిగినయ్. దశాబ్దాల తరబడి జరిగినయ్. దుశ్చర్ల సత్యనారాయణ నల్లగొండ జిల్లా బిడ్డ. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపిండ్రు. అంశాల స్వామి అనే ఫ్లోరైడ్ బాధితుడిని తీసుకెళ్లి, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన టేబుల్ మీద పడుకోబెట్టి సమస్యను వివరించిండ్రు. ‘అయ్యా మా బతుకులు ఇట్లయితున్నయ్. మా నడుములు వంగిపోతున్నయ్’ అని చెప్పిండ్రు. అయినా సమస్య పరిష్కారం కాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా ఆ సమస్యను పరిష్కరించలే’ అని కేసీఆర్ గుర్తుచేశారు.
‘తెలంగాణ భౌగోళిక పరిస్థితిని అనుసరించి ప్రతి వేసవిలో ఈ సమస్య వస్తదని మేం గుర్తించినం. ఆ పరిస్థితి ఉండగూడదని మేం ఛాలెంజింగ్‌గా తీసుకుని ఒక మిషన్ మోడ్‌లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ. కృష్ణా థర్డ్ ఫేజ్ కంప్లీట్ చేసి, ఎల్లంపల్లి నీళ్లను కూడా త్వరగా పర్మిషన్లు ఇప్పించి తీసుకొచ్చినం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. హైదరాబాద్ సిటీ, ఇతర మున్సిపాలిటీల్లో వీధి నల్లాలు కనిపించకుండా ప్రతి ఇంటికి ఒక రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చినం. అసలు నీళ్ల ట్యాంకర్లు బంద్ అయినయ్. నీళ్ల వ్యాపారం బంద్ అయ్యింది’ అని చెప్పారు.